11/06/2015
సామాన్యశాస్త్రం - జీవన'చాయ్'
మిత్రులారా, మరొక మాసం తర్వాత నా మూడవ ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నాను. ఈ సారి మరింత సామాన్యంగా, మరింత అందంగా నా ప్రద్శరన ఉండబోతోంది. తెలుగునాట సామాన్యులను దరిద్రనారాయణులుగానో లేదా అభాగ్యులుగానే తమ రచనల్లో, ఛాయా చిత్రాల్లో చిత్రిక పట్టే మహా రచయితలను, గొప్ప ఫొటోగ్రాఫర్లను మీరు చూశారు. అదృష్టం కొద్ది వారి తీరుకు భిన్నంగా నాకంటూ ఒక చూపు అబ్బింది. సామాన్యశాస్త్రం పుట్టింది. తద్వారా పుస్తకాలు, ఫొటోగ్రఫి ఎగ్జిబీషన్లతో నేను సామాన్యుల జీవన సంబురాన్ని, నిరాడంబర జీవన ఛాయలను లేదంటే వారి బతికిన క్షణాలను ప్రతిబింబిస్తూ ఉన్నాను. ఆ ఒరవడిలో పుస్తకాలు పన్నెండు వచ్చాయి. ఛాయా చిత్ర ప్రదర్శనలు రెండూ నిర్వహించాను. ఇదంతానూ మిత్రుల సహకారంతోనే అని మళ్లీ యాది చేస్తున్నాను. కేవలం వంద రూపాయల సహాయంతో పన్నండు పుస్తకాలు ఈ పన్నెండేళ్లలో ప్రచురించాం. అట్లే రెండు పెద్ద ఎగ్జిబీషన్లూ నిర్వహించాం. ఈ సారి మూడోది. మరింత అద్భుతంగా ప్రదర్శన జరపాలని నిశ్చయించుకున్నాను. నా దృష్టిలో అద్భుతం అంటే మరింత సామాన్యం అని గమనించ ప్రార్థన.
అయితే ఈ ప్రదర్శన కోసం నేనొక కొత్త ఛాలెంజ్ పెట్టుకున్నాను. అది జీవన'చాయ్'. అవును.ఇప్పటికే మీరు గమనిస్తున్నారు కూడా. మరేం లేదు. నాతో టీ తాగి మీకు తోచిన విరాళం ఇవ్వడమే. ఆ పద్ధతిలో నేను ఇప్పటికే ఏడుగురును కలిశాను. యాభైవేలకు పైగా రూపాయలను సేకరించుకున్నాను. నేను కలిసిన మనుషుల జీవనచ్ఛాయలను తీశాను. రాశాను. ఆ పేజీ లింక్ః https://www.facebook.com/CHAIenge?ref=hl
చాలా చిన్న పనే. ఒక కప్పు ఛాయ తాగి మిమ్మల్ని పరిచయం చేసుకోవడం, నా పనులను నేను కాస్త మీకు అర్థం చేయించడం. ఇంతే. ఇందుకోసం మీరు నాకొక మెసేజ్ పెట్టండి. ఉదయాన్నో సాయంత్రమో లేదా ఆదివారమో మిమ్మల్ని కలుస్తాను. కాసేపు స్పెండ్ చేసి మీ సహాయాన్ని ఈ ప్రదర్శన నిమిత్తం స్వీకరిస్తాను. ఇదంతా నా కోసం అనే అంటాను. నా ద్వారా సమాజం కోసం. సమాజ ప్రతిబింబం కోసం అనీ మీరు గమనిస్తారు. గమనించిన వారికి చెప్పనక్లర్లేదు. గమనించేవాళ్లు నిమగ్నమై తెలుసుకోవాలనే ఈ నాలుగు మాటలు...
ఈ చాలెంజ్ లేదా జీవన'చాయ్' లో భాగంగా ఒకరు నాకు నూటా పదకొండు రూపాయలు సహకరిస్తే మరొకరు ఇరవై ఐదు వేలు ఆర్థికసహాయం చేశారు. ఎంత అన్నది కాదు, ఎందరు అన్నది ముఖ్యం. (అలా అని గతంలోలాగా వంద రూపాయలు చాలు అని అనదల్చుకోలేదు. లిమిట్ ఏమీ లేదంటున్నాను. కారణం గొప్ప పనులున్నాయి మున్ముందు...) సుమారు రెండొదల నలభై మంది సహాయంతో నా పన్నెండో పుస్తకం నామవాచకం అచ్చయింది. అట్లా ఈ ఛాయా చిత్ర ప్రదర్శన కూడా ఒక కమ్యూనిటీ షో. మీరంతా ఈ ప్రదర్శనలో వీక్షకులు, సందర్శకులు కాదు, నిర్వాహకులు. ముఖ్య అతిథులు.
అవును. ఈ సారి మనమే చిత్ర పదర్శన ఏర్పాటు చేసుకుంటాం. మనమే ఆరంభించుకుంటాం. చీఫ్ గెస్ట్ అన్న ఒరవడికి ఈ షోతోనే సమాప్తం. అవును. పుస్తకాల విడుదలలో ఆరంభించిన సంప్రదాయం నేను ఫోటోగ్రఫి ఎగ్జిబీషన్లలో మిస్సయ్యను. ఆ పొరబాటు ఈ సారి చేయదల్చుకోలేదు. మీ విరాళం, నా కృషి ఫలితంగా ఈ ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శనలో వుంచిన ఛాయా చిత్రాల్లో నాకు సహాయం చేసిన వారు తమకు నచ్చిన ఫ్రేం తీసుకెళ్లడం ఒక సంతోషం. అందమైన అనుభవం. అదెలాగూ ఉంటుంది. అంతేకాదు, ఈ సమిష్టి ప్రయత్నం నుంచి నేనొక ముందడుగు వేయాలని కూడా యోచిస్తున్నాను. పీపుల్స్ గ్యాలరీ నొకదాన్ని ఏర్పాటు చేసి నిత్యం సామాన్యుల జీవితాలను లైఫ్ సైజ్ లో ప్రదర్శించే తొలి గ్యాలరిని కూడా సమీప భవిష్యత్తులో ప్రారంభించాలని ఉంది. అందుకు కూడా ఈ ప్రదర్శన ఒక తొలి అడుగు అవుతుందని భావిస్తున్నాను. ప్రదర్శనలో వుంచి చిత్రాల అమ్మకాలను ఈ దిశగా సద్వినియోగం చేయాలని భావిస్తున్నాను. కావున ఈ ఎగ్జిబిషన్ అనంతరం గ్యాలరీ ప్రారంభోత్సవానికే మిమ్మల్ని పిలుస్తాననే అనుకుంటున్నాను.. అవును. అంత గట్టి సంకల్పంతో వెళుతున్నాను.
మరి అంతదాకా నా ఫొటోలు లైక్ చేయడం కాదు, నా ఫొటోలు ప్రదర్శన చేయడానికి, పుస్తకాలుగా అచ్చుకావడానికి, అట్లే ఒక గ్యాలరీ నిలబడటానికీ కూడా మీ చిన్న విరాళం సరిపోతుంది. నాతో ఒక ఇరానీ చాయ్ తాగండి లేదా మీతో ఛాయ్ తాగే భాగ్యం కలిగించండి. తద్వారా గొప్ప ఆశయాలు చాలా సామాన్యంగా సాధించుకోవచ్చన్న నమ్మికా ఇవ్వండి. థాంక్యూ సో మచ్.
మీతో జీవన'చాయ్'కి సిద్ధం.
మరి మీ ఇన్విటేషన్ కోసం ఎదిరి చూస్తుంటాను.
- కందుకూరి రమేష్ బాబు
[email protected]